
రష్యాను బెదిరించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న ఓ తొందరపాటు నిర్ణయం ఐరోపా దేశాలకు ప్రాణసంకటంగా మారనుంది. మధ్యశ్రేణి క్షిపణులను మోహరించకుండా మాస్కో-వాషింగ్టన్ ల మధ్య ఉన్న ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ) ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది. పశ్చిమదేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును సృష్టించాయని ఆరోపించింది. ఈ క్రమంలో ఒప్పందాన్ని అనుసరించే పరిస్థితులు లేవని తేల్చి చెప్పింది. తాము కొన్ని రకాల క్షిపణులను మోహరించకుండా విధించుకొన్న ఆంక్షలను ఇక పాటించబోమంది. అమెరికా దళాలు ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌క్షిపణి లాంచర్లను మోహరించడం , ఆస్ట్రేలియా సమీపం లోని టలిస్మాన్ సాబ్రె డ్రిల్స్‌లో క్షిపణులను పరీక్షించడం దీనికి ప్రధాన కారణంగా వెల్లడించింది. మరోవైపు ట్రంప్ చర్యలు కూడా దీనికి ఆజ్యం పోశాయి. ఇటీవలే రష్యా మాజీ అధ్యక్షుడు మెద్విదేవ్ ప్రకటనకు స్పందనగా రెండు ఒహైయో శ్రేణి అణుజలాంతర్గాములను మోహరించేలా ఆదేశాలు జారీ చేశారు.
















