ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. యుద్ధ నేరాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్ట్ వారెంట్ సైతం జారీ చేసింది. అయినా, రష్యా అధ్యక్షుడు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆకస్మికంగా ఉక్రెయిన్లోని మారియుపోల్ నగరంలో పర్యటించారు. ఈ నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించింది.
డొనెట్స్క్ రాష్ట్రంలోకి వచ్చే ఈ నగరం గతేడాది మే నుంచి రష్యా ఆధీనంలో ఉన్నది. ఈ క్రమంలో పుతిన్ తొలిసారి క్రిమియాకు చేరుకొని అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో మారియుపోల్ నగరానికి చేరుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పుతిన్ స్వయంగా కారులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతోనూ మాట్లాడారు. మరియూపోల్ బీచ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని సైనిక ఆపరేషన్ టాప్ కమాండర్‌ను సైతం కలిశారు. ఉక్రెయిన్‌లో రష్యాకు ప్రాతినిథ్యం వహిస్తున్న చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్‌తో భేటీ అయ్యారు. దక్షిణ రష్యాలోని రోస్టోవ్ ఆన్ డాన్ కమాండ్ పోస్ట్‌లో వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది.
