విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం సైంధవ్. తమిళనటుడు ఆర్య, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకుడు. వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఈ చిత్రంలోని రాంగ్ యూసేజ్ అంటూ సాగే పాటను హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీలోని విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి రోజు పాజిటివ్‌గా ఆలోచించడం అలవరచుకోండి. జీవితం చిన్నది. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించండి అని అ న్నారు. 37 ఏండ్ల సినీ ప్రయాణం నాది. నా మొదటి సినిమాను మీ పేరెంట్స్ చూసుంటారు. అప్పుడు వాళ్లకు నా సినిమాలు నచ్చాయి. ఇప్పుడు మీకు కూడా నా సినిమాలు నచ్చడం ఆనందంగా ఉంది.
సైంధవ్ నా 75వ సినిమా. నా మనసుకు దగ్గరైన సినిమా. నిర్మాత గ్రాండ్‌గా నిర్మించారు. దర్శకుడు శైలేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ రోజు రాంగ్ యూసేజ్ సాంగ్‌ని విడుదల చేస్తున్నాం.సెల్‌ఫోన్‌నీ, డబ్బునీ ప్రేమిస్తూ మనకు మనం దూరమవుతున్నామని చెప్పే పాట ఇది. చంద్రబోస్ అర్థవంతంగా ఈ పాట రాశారు. సంతోశ్ నారాయణన్ స్వరపరిచిన ఈ పాటను నకాష్ అజీజ్ ఆలపించారు. మీరందరూ కచ్చితంగా వినాల్సిన పాట అని చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.