శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సామజవరగమన. రెబా మోనికా కథానాయిక. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండా నిర్మాత. ఈ చిత్రంలో నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రతి చిన్న విషయానికి చిరాకు పడే యువకుడిగా శ్రీవిష్ణు కనిపించారు. ప్రేమ, ద్వేషం వెనకున్న కారణాల్ని వివరిస్త్తూ టీజర్ ఆసక్తిగా సాగింది. కామెడీ ఆకట్టుకునేలా ఉంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు అనిల్ సుంకర మాట్లాడుతూ శ్రీవిష్ణు ఎంచుకునే కథలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో ఆయనలోని కామెడీ కోణాన్ని చూస్తారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరిని మెప్పిస్తుంది అన్నారు. కుటుంబమంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేసే చిత్రమిదని దర్శకుడు రామ్ అబ్బరాజు తెలిపారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ వినోదాత్మకంగా సాగే సకుటుంబ కథా చిత్రమిది. సినిమా ఆసాంతం నవ్వుతూనే ఉంటారు. ప్రతి పాత్రకు సమప్రాధాన్యం ఉంటుంది. గోపీసుందర్ అద్భుతమైన సంగీతాన్నందించాడు. ఈ వేసవిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్ దందా, రెబా మోనికా జాన్, గోపిసుందర్ పాల్గొన్నారు.