ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈసారి తానా 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది. తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందు కు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహాసభలకు అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు అమెరికాలోని రాజకీయ ప్రముఖులు, ఇండియాలో ఉన్న రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు, ఇతరులు మహాసభలకు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తాజాగా ఈ మహాసభలకు మరో ఆకర్షణగా ప్రముఖ హీరోయిన్ సమంత నిలవనున్నారు. ఆమె మహాసభలకు రావడానికి అంగీకారం తెలపడంతో తానా మహాసభలు మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమంత ఇండియా వెలుపల ఉన్న తెలుగు మహాసభలకు రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.

టాలీవుడ్ అగ్ర తార.. బ్యూటిఫుల్ హీరోయిన్.. యూత్ ఆల్‌టైమ్ ఫేవరెట్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్‌లోనే వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అనేక చిత్రాల్లో అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ.. తనదైన టాలెంట్‌తో ప్రేక్షకుల్ని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నిర్మాతగా మారి పలు సినిమాలను తీస్తోంది. ఇటీవల ‘శుభం’ మూవీకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.

ఎంతో పాపులారిటీ ఉన్న సమంత తానా మహాసభలకు వస్తుండటంపట్ల అమెరికాలోని పలువురు తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
