నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతోన్న చారిత్రాత్మక చిత్రం స్వయంభు. సంయుక్త మీనన్ కథానాయిక. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. సంయుక్త మీనన్ మాట్లాడుతూ నా తదుపరి చిత్రం స్వయంభు కోసం, నేను గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నా. నిజంగా ఇది అద్భుతమైన ప్రయాణం. మేమందరం ఒక టీమ్‌గా కలిసి పనిచేస్తున్నాం అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇందులో హీరో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే పలు యుద్ధవిద్యల్లో ప్రావీణ్యం పొందే పనిలో నిఖిల్ బిజీగా ఉన్నాడని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో అద్భుతమైన యుద్ధ సన్నివేశాలు ఉంటాయని, గతంలో ఎన్నడూ చూడని భయంకరమైన పోరాటాలను ఇందులో చూస్తారని వారు తెలిపారు. ఇంకా చెబుతూ ఇందులో సంయుక్త మీనన్ పాత్ర కథలో చాలా కీలకం. కథానుగుణంగా నిఖిల్‌తోపాటు ఆమె కూడా కొన్ని యుద్ధ సన్నివేశాల్లో పాల్గొంటారు. అందుకోసమే గుర్రపుస్వారీతోపాటు యుద్ధ విద్యల్ని కూడా నేర్చుకుంటున్నారు అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వాసుదేవ్ మునెప్ప, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్, సమర్పణ: ఠాగూర్ మధు.