గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్ (టీఏజీబీ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు విజయవంతమయ్యాయి. స్థానిక బెల్లింగ్‌హామ్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకకు 650 మందికి పైగా ప్రవాస తెలుగువారు హాజరై, మన సంస్కృతీ సంప్రదాయాలను ఘనంగా చాటి చెప్పారు. ఈ వేడుకల్లో ప్రముఖ భారతీయ సినీ గాయని షణ్ముఖ ప్రియ అండ్ టీం లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రధాన ఆకర్షణగా నిలిచి, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.


ఈ సందర్భంగా టీఏజీబీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది మాట్లాడుతూ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను అన్ని తరాల వారిని అలరించేలా నిర్వహించాలన్న తమ సంకల్పం నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 650 మంది సభ్యులు ఒకేచోట చేరి మన పండుగను జరుపుకోవడం గర్వకారణమన్నారు. స్థానిక కళాకారుల ప్రతిభకు, షణ్ముఖ ప్రియ వంటి అంతర్జాతీయ స్థాయి గాయని ప్రతిభ తోడవ్వడం ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చిందన్నారు. 2026-27 నూతన కార్యవర్గం నేతృత్వంలో టీఏజీబీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఈ విజయం ఒక చక్కని మార్గమవుతుందని పేర్కొన్నారు.


బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ అంకినీడు రావి మాట్లాడుతూ ఈ వేడుకల విజయానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, గ్రాండ్ స్పాన్సర్ల మధ్య ఉన్న సమన్వయమే కారణమని ఆయన తెలిపారు. కార్యవర్గం పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని విజయవంతం చేసిందన్నారు. టీఏజీబీ ఎప్పుడూ తన సామాజిక బాధ్యతను, సాంస్కృతిక విలువలను కాపాడటంలో ముందుంటుందన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.















