సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్) సభ్యులు విదేశీ గడ్డపై ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం చేస్తున్న కృషిని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవి ప్రశంసించారు. ప్రవాసీయులందరు ఇదే విధంగా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఉద్బోధించారు. ఉండడానికి సరిగ్గా ఇల్లు లేక, అప్పులతో బిడ్డ పెళ్ళి చేసి, వాటిని తీర్చడానికి సౌదీ అరేబియాలోని అల్ హాసాకు వచ్చి అకాల మరణం చెందిన జగిత్యాల జిల్లా మేడిపలి మండలం గోవిందారం గ్రామానికి చెందిన మెగిళ్ళ శ్రీనివాస్ కుటుంబానికి సాటా సభ్యులు అండగా నిలిచారు.
మృతుడి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ జి. రవి చేతుల మీదుగా రెండున్నర లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని సాటా ప్రతినిధులు కె.పి. మహేందర్ జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి సహకరించడంతో పాటు మృతుడి కుటుంబ పరిస్థితిపై సాటా ప్రతినిధులు చలించిపోయారు. సాటా ప్రతినిధులు కె.పి. మహేశ్, ముజ్జమ్మీల్ శేఖ్, మల్లేషన్, తేజ, అవినాష్,వెంకటేశ్, అబ్దుల్ రఫీక్లతో పాటు దమ్మాంలోని తెలుగు సంఘమైన సాట్స్ ప్రతినిధి వరప్రసాద్ ప్రభాతి కూడా విరాళాలు సేకరించారు. ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు.