బంగార్రాజు, సత్యభామ చూడముచ్చటైన జంట. వారిద్దరి సరసల్లాపాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ జోడీ చేసే హంగామా ఏంటో తెరపై చూడాల్సిందే అంటున్నారు కల్యాణ్ కృష్ణ కురసాల. ఆయన దర్శకత్వంలో నాగార్జున కథనాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ ఇది. రమ్యకృష్ణ జన్మదినం సందర్భంగా సత్యభామగా ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ సంప్రదాయ వస్త్రదారణలో హుషారుగా నటిస్తూ కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం అని చిత్ర బృందం తెలిపింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. కృతిశెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనూప్‌రూబెన్స్, కెమెరా: యువరాజ్, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ, దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ కురసాల. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, అన్నపూర్ణ సంస్థలు నిర్మిస్తున్నాయి.