చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 153వ చిత్రం గాడ్‌ఫాదర్. తాజాగా ఈ సినిమాలో యువ హీరో సత్యదేవ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి సినిమాలో భాగం కావడం పట్ల సత్యదేవ్ సంతోషం వ్యక్తం చేశారు. అభిమానిగా ఎప్పుడూ మీ పేరునే తలుస్తాను. మీ స్ఫూర్తినే నటుడిగా మారాను. ఆచార్య చిత్రంలో మీతో పాటు కాసేపు కనిపించే అదృష్టం దక్కింది. మరలా గొప్ప అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో సత్యదేవ్ పూర్తిస్థాయి పాత్రను పోషిస్తున్నారని, తన అభిమాని మంచి నటుడు కావడం ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో ఆయనకిది తొలి చిత్రం కావడం విశేషం. దర్శకుడు పూరి జగన్నాథ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మోహన్ రాజా దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ చిత్రానికి నిర్మాతలు : ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్. కొణిదెల సురేఖ సమర్పకులు. నీరవ్ షా కెమెరా బాధ్యతలు నిర్వర్తిసుండగా, తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.














