కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూర్ వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత కార్యక్రమం ఘనంగా జరిగింది. పెరుమాళ్ కోవెల ప్రాంగణంలోని పీజీపీ హాల్లో ఈ వ్రతాన్ని నిర్వహించారు. కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూర్ సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ.. కొవిడ్ అనంతరం తమ సంస్థ తరపున జరిపిన మొదటి ప్రత్యక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సామూహిక వ్రతాన్ని విజయవంతం చేసేందుకు శ్రమించిన కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు రేపటి తరాలకు గుర్తుండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని పేర్కొన్నారు. సింగపూర్లో నివసిస్తున్న తెలుగు వారే కాకుండా, కన్నడ వారు కూడా ఈ వ్రతంలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో 100 జంటలు పాల్గొన్నాయి. దాదాపు 500 మంది హాజరై, స్వామి వారి దర్శనం చేసుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వ్రతంలో పాల్గొన్న దంపతులందరికీ.. స్వామి వారి కండువాలు, ప్రతిమలను అందజేశారు.