శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం (వైశాఖ, మాఘ, కార్తీక మాసాల్లో ఏకాదశి, పౌర్ణమి) నాడు ఆచరించిన విశేష శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మాఘ మాసం పౌర్ణమి సందర్భంగా హాంగ్‌కాంగ్‌లోని హ్యాపి వ్యాలీ హిందూ టెంపుల్‌లో సామూహిక సత్య నారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారు నిర్వహించారు. సమాఖ్య సభ్యులు ఎంతో ఆనందోత్సాహాలతో తమ కుటుంబ సభ్యులతో వచ్చి పూజ చేసుకున్నారని వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటి తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/02/satyanarayanaswamy.jpg)
హాంగ్‌కాంగ్‌లో తమలపాకులు వొక్కలు దొరకడం కష్టమని, దొరికిన చాలా ఖరీదని, అయినా ప్రతి సంవత్సరం ఈ పూజకు ఏదో విధంగా మాకు భారత్ దేశం నుంచి మా సభ్యులు ఎవరో ఒకరు వీటిని అందజేస్తున్నారని ఆనందంగా చెప్పారు. ఇక్కడ తెలుగు పురోహితులు లేరని, తమ సభ్యులే ఒకరు పూజ, కథ విధి విధానమంతా చేయిస్తారని, ఈసారి మెరైన్ ఇంజినీరైన శివరాం రాంభట్ల ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారయణ స్వామి పూజను అందరి చేత చేయించారని సంతోషం వ్యక్తం చేశారు. అందరూ ప్రసాద భోజనాల అనంతరం సంతోషంగా తృప్తిగా తిరిగెళ్లారని తెలిపారు.