మూడేండ్లు గా మారణ హోమాన్ని సృష్టిస్తున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశ గా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రియాద్ లో అమెరికా, రష్యా ప్రతినిధుల బృందాలు నేడు సమావేశం కానున్నాయి. అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ ఈ చర్చ ల్లో పాల్గొననున్నారు. రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గేయ్ లావ్రోవ్, పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యురి ఉషా కోవ్ సమావేశానికి హాజరుకానున్నారు.
ఉక్రెయిన్ తో యుద్ధవిరమణ ఒప్పందం, అమెరికా – రష్యా మధ్య సంబంధాల పునరుద్ధరణ పై ఈ సమావేశం లో చర్చలు జరగనున్నాయి. యుద్ధవిరమణ ఒప్పందం కోసం తదుపరి కార్యాచరణ సైతం ఖరారయ్యే అవకాశం ఉంది. త్వర లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ మధ్య తుది చర్చలు జరగనున్నాయి. వీరి భేటీ పై కూడా మంగళవారం ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.
