విజిట్ వీసాల పునరుద్దరణ విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక ప్రకటన చేసింది. విజిట్ వీసాల రెన్యువల్‌కు కొత్త ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని సౌదీ అరేబియా హెల్త్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. విజిట్ వీసా పొడిగించిన కాలానికి కొత్త ఆరోగ్య బీమా కవరేజీని పొందడం తప్పనిసరి అని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ తెలిపింది. ఇక సింగిల్ ఎంట్రీ వీసాల గడువును 3 నెలలకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీసా నిబంధనల్లో చేసిన సవరణల కారణంగా సింగిల్ ఎంట్రీ ఫ్యామిలీ విజిట్ వీసాలు నెల రోజులు చెల్లుబాటు అయితే, మల్టీపుల్ ఎంట్రీ వీసాలు 90 రోజులు చెల్లుబాటు అవుతాయని జవాజత్ తెలిపింది. విజిట్ వీసాల సింగిల్ ఎంట్రీ వాలిడిటీని పెంచుతూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం అన్ని రకాల ప్రయోజనాలకు వర్తిస్తుంది.
