బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ లీడ్‌రోల్స్ చేసిన హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ని హైదరాబాద్‌లో మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హీరో సాయిదుర్గతేజ్, దర్శకులు అనిల్ రావిపూడి, కె.ఎస్.రవీంద్ర (బాబీ), మల్లిడి వశిష్ట, అనుదీప్ విచ్చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు అందించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమాను గొప్పగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకదేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కిష్కింధపురి థియేటర్లలో మాత్రమే చూడాల్సిన సినిమా. చూడనివారు థియేటర్లకు వచ్చి చూడండి. చూసినవారు మరొక్కసారి చూడండి పర్లేదు. మీకు నచ్చితే మరో పదిమందికి చెప్పండి. అందరికీ నచ్చే సినిమా ఇది అని చెప్పారు.

దర్శకుడు కౌశిక్ ఈ కథను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారని, హీరో హీరోయిన్లతోపాటు అందరూ ప్రాణం పెట్టి పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని నిర్మాత సాహు గారపాటి అన్నారు. థియేటర్లకు జనం రావడం గగనమైపోయిన ఈ రోజుల్లో చాలా రోజుల తర్వాత హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుంటే ఆనందంగా ఉందని దర్శకుడు కౌశిక్ అన్నారు. ఇంకా సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ కూడా మాట్లాడారు. ఈ నెల 12న సినిమా విడుదలైంది.
















