వందల కోట్ల సంపద, చుట్టూ పనివాళ్లు, అత్యంత ఖరీదైన భవంతులు, ఇవన్నీ వదిలి సన్యాసం స్వీకరించా లని గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి, ఆయన భార్య నిర్ణయించుకున్నారు. భౌతిక ప్రపంచానికి దూరంగా వెళ్లి ఓ సన్యాసిగా మారేందుకు భవేశ్ భాయ్ భండారి, ఆయన భార్య తమ రూ.200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇవ్వ డానికి సిద్ధమయ్యారు. జైన సామాజికవర్గానికి చెందిన వీరు సన్యాస మార్గంలో వెళ్లేందుకు దీక్షను చేపట్టారు. ఇకపై కేవలం భిక్షాటన ద్వారా తమ రోజువారీ జీవనం కొనసాగించబోతున్నారు. ఈ సందర్భంగా సబర్‌కాంత జిల్లాలో భండారి నివసిస్తున్న హిమ్మత్‌నగర్‌లో భారీ ఊరేగింపు కూడా నిర్వహించారు. మెటీరియ లిజం ఉచ్చు లో చిక్కుకోకుండా ఆధ్యాత్మిక అన్వేషణ వైపు అడుగేయాలని నిర్ణయించుకున్నట్టు వారు ప్రకటించారు.
ఏప్రిల్ 22న కొంతమంది సమక్షంలో నది ఒడ్డున వారి సన్యాస స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భండారి పిల్లలు ఇప్పటికే సన్యాసం దిశగా అడుగులేయటం ఆ దంపతుల్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని తెలిసింది. భండారి కుమారుడు, కుమార్తె 2022లో సన్యాసం స్వీకరించారు.