అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ తప్పుకొన్నారు. ఈ మేరకు బైడెన్ స్వయంగా ప్రకటన చేశారు. దేశంతోపాటు డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాల కోసం అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొంటున్న ట్టు ప్రకటించిన 81 ఏండ్ల బైడెన్, దేశాధ్యక్షుడిగా 2025, జనవరి వరకు ఉన్న తన పూర్తి పదవీ కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు.

గత నెల ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో తడబాటు, ఇతరత్రా అంశాల నేపథ్యంలో అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవా లని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. దేశానికి అధ్యక్షుడిగా సేవలు అందించడం తన జీవితంలో గొప్ప గౌరవమని బైడెన్ పేర్కొన్నారు. తిరిగి ఎన్నిక కావాల నేది నా ఉద్దేశం. అయితే దేశం, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్నా. మిగతా పదవీ కాలం అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించడంపై దృష్టి పెడుతా అని అన్నారు.
