కెనడాలో నివసిస్తున్న భారతీయులు సహా పలువురు విదేశీ వలసదారులను దేశం నుంచి పంపించేసేందుకు ఆ దేశ ప్రభుత్వ కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. వారికి పొమ్మనకుండా పొగబెడుతున్నది. వీసా పునరుద్ధరణలో తీవ్ర జాప్యం కారణంగా వలసదారులు వర్క్ పర్మిట్లను కోల్పోతున్నారు. పైగా వారి చట్టబద్ధమైన హోదాను కొనసాగించే ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.

వలసవాదులు పన్ను చెల్లిస్తున్నప్పటికీ, వారు చట్టబద్ధమైన స్థితిని కనుక పొందకపోతే వారు అధికారికంగా అక్కడ పనిచేయలేరు. అలాగే వైద్య సహాయం, ఇతర సౌకర్యాలు కోల్పోతారు. కెనడాకు వస్తున్న వలసదారుల కారణంగా ఇళ్ల సమస్యతో పాటు, ఇళ్ల అద్దెలు పెరిగిపోతుండటంతో స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. దీంతో వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే అధికారంలో ఉన్న లిబరల్ ప్రభుత్వం పత్రాలు లేని వ్యక్తులకు హోదా ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం యూటర్న్ తీసుకుని వివిధ రంగాలలో పనిచేసే కొందరు వ్యక్తులకు మాత్రమే దీనిని అందస్తామని చెప్పింది.
