రియల్ ఎస్టేట్‌కు సంబంధించి ప్రవాసులకు మేలు చేసేలా షార్జా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారుల కోసం రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ చట్టం 2010లో షార్జా కీలక మార్పులు చేసింది. ఈ మేరకు చట్టంలోని సవరణ నం. 05లో మార్పులు చేస్తూ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డా. షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి చట్టం నం. 02, 2022ను జారీ చేశారు. 2010 నాటి చట్టం నం. 05లోని ఆర్టికల్ 04 ప్రకారం షార్జాలో రియల్ ఎస్టేట్‌ను సొంతం చేసుకునే హక్కు యూఏఈ పౌరులు, జీసీసీ పౌరులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ చట్టానికి మినహాయింపుగా యాజమాన్య హక్కును ఇతరులకు బదిలీ చేసేందుకు వీలు కల్పించారు. పాలకుల ఆమోదం, చట్టపరమైన నోటిఫికేషన్, వారసత్వ బదిలీ, యజమాని తన మొదటి స్థాయి బంధువులలో ఒకరికి ఇవ్వడం, మండలి నిర్ధేశించిన నిబంధనలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి ప్రాంతాలు, ప్రాజెక్టులలో యాజమాన్యం హక్కులను బదిలీ చేయవచ్చు. షార్జా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.