స్కిల్ డెవలప్‌మెంట్ సీఐడీ నమోదు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడలోని అనిశా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం ఉదయం 8:15 నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ అనిశా కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణంలో సాయంత్రం 6:45 గంటల సమయంలో న్యాయాధికారి ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతరం పోలీసులు చంద్రబాబును రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం తీసుకెళ్లి అర్థరాత్రి 1:16 గంటలకు కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ కేసులో ఆదివారం ఉదయం విచారణ మొదలవగానే న్యాయాధికారి హిమబిందు అనుమతితో చంద్రబాబు మొదట తన వాదన వినిపించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన అరెస్టు రాజకీయ ప్రేరేపితమని, వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి తనను కేసులో ఇరికించిందని ఆయన వివరించారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరపున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. సీఐడీ కస్టడీలో ఉన్న చంద్రబాబు ఉదయం 7:49కి కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుహాలు కిక్కిరిసి ఉండటంతో తన ఛాంబర్‌లోనే విచారిద్దామని న్యాయాధికారి సూచించారు.
ఓపెన్ కోర్టులోనే విచారించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. విచారణ ప్రక్రియ సాఫీగా సాగాలంటే కేసుకు సంబంధించినవాళ్లే హాల్లో ఉండి, మిగతావారంతా బయటకు వెళ్లిపోవాలని ఆమె ఆదేశించారు. ఉదయం 8:15 గంటలకు విచారణ మొదలైంది. మొదటి సుమారు 20 నిమిషాల పాటు చంద్రబాబు తన వాదన వినిపించారు. అప్పుడు తప్ప ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు కొనసాగినంత సేపు కోర్టులో హాల్లో కూర్చుని ఉన్నారు. ఉదయం 1:30 గంటలకు స్వల్ప విరామం ఇచ్చారు. మళ్లీ 12:40 వరకు వాదనలు కొనసాగాయి. భోజన విరామం అనంతరం 1:45కి మళ్లీ వాదనలు ప్రారంభించి, 2:34కి ముగించారు. చంద్రబాబుకు రిమాండు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువడటంతో ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.