ఉక్రెయిన్‌పై భీకర యుద్ధాన్ని కొనసాగిస్తోన్న రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి యూరోపియన్ పార్లమెంట్ మద్దతు పలికింది. ఉక్రెయిన్‌లో పౌర స్థావరాలే లక్ష్యంగా విద్యుత్, ఆసుపత్రులు, పాఠశాలలపై పుతిన్ సైన్యం దాడులు చేస్తోందని ఆరోపించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఈయూ పార్లమెంట్ స్పష్టం చేసింది. ఇలా ఉక్రెయిన్‌పై దారుణాలకు పాల్పడుతోన్న రష్యాను ఉగ్రవాద ప్రోత్షాహక దేశంగా ప్రకటించే తీర్మానాన్ని ఓటింగ్ నిర్వహించగా 494 సభ్యులు మద్దతు పలికారు. మరో 58 మంది వ్యతిరేకించగా ,మరో 44 మంది సభ్యులు ఓటింగ్ దూరంగా ఉన్నారు. ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా తమ పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోందంటూ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఆర్థికంగా, విద్యుత్, చమురు పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న యూరిపియన్ దేశాలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు. ఈ తీర్మానానికి మద్దతు తెలపడానికి అమెరికా నిరాసక్తత వ్యక్తం చేస్తున్నది.
