కెనడాలో నివసించాలని, పనిచేయాలని కోరుకునే భారతీయులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది. అంతర్జాతీయ విద్యార్ధులు, తాత్కాలిక విదేశీ కార్మికులు లక్ష్యంగా వలస నిబంధనల్లో సవరణలకు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ ఏడాది అంతర్జాతీయ స్టూడెంట్ పర్మిట్స్‌లో 35 శాతం కోత విధించనున్నామని, 2025లో 10 శాతం కోత విధిస్తామని ట్రూడో తెలిపారు. తమ ఆర్ధిక వ్యవస్ధకు వలసలు కీలకమని, కానీ వ్యవస్ధను కొందరు దుర్వినియోగం చేస్తూ విద్యార్ధుల ప్రయోజనాలను పొందినప్పుడు తాము అణిచివేయకతప్పదని ఆయన స్పష్టం చేశారు.
ఇక విదేశీ విద్యార్ధుల వీసాలు భారీగా తగ్గిస్తామని ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిలర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. 2024తో పోలిస్తే వచ్చే ఏడాది అంతర్జాతీయ విద్యార్ధుల రాకపై పరిమితి పదిశాతం తగ్గిస్తామని వెల్లడించారు. 2026లోనూ విద్యార్ధి వీసాల పరిస్ధితి నిలకడగా ఉంటుందని ఇది 2023 స్ధాయిలతో పోలిస్తే 36 శాతం తక్కువని తెలిపారు.