బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ లు కల్పిస్తుండటాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఆందోళన లను అణిచేందుకు బంగ్లా ప్రభుత్వం కర్ఫ్యూ విధించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇవాళ సర్కారు ఏకంగా షూట్ ఎట్ సైట్ ఆదేశాలను జారీ చేసింది.
ఆందోళనలు చెలరేగిన అన్ని ప్రాంతాల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఆందోళనకారులపై భత్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 115 మంది మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం కొంత సేపు కర్ఫ్యూను సడలించింది. అయితే సడలింపు సమయంలోనూ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా సమావేశాలు, సభలపై నిషేధం విధించింది. అంతేగాక దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను కూడా నిషేధించింది.