అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ సంగీతం, డ్యాన్స్, భాషలను విద్యార్థులకు అందిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని 2016లో కాలిఫోర్నియాలో ప్రారంభించారు. కొత్తగా శాన్‌వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణంలో మరో క్యాంపస్‌ను నిర్మాస్తున్నారు. వర్సిటీ నిర్మాణానికి అవసరమైన 67 ఎకరాల భూమిని సంధు కుటుంబం ఇవ్వనుందని వర్సిటీ అధ్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ తెలిపారు. అందరి మన్నలను, సహకారాన్ని పొందిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్థానికంగా, దేశవ్యాప్తంగా విభిన్న రంగాల అభివృద్ధికి విద్యను అందిస్తున్నదని చెప్పారు. స్థానికంగా ఉండే అట్టడుగువర్గాల అభివృద్ధికి తోడ్పడుతూ సృష్టమైన ప్రణాళికతో, ఉన్నతస్థాయిలో పరిశోధనాత్మకమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా శాన్ వాకిన్ జిల్లా యువత అనేక రకాలుగా లబ్ధి పొందుతారని సంధు కుటుంబ సభ్యులు మైక్ సంధు, మణి సంధు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే 5 సంవత్సరాల కాలంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఈ ప్రాంగణ నిర్మాణం సింహభాగాన్ని పూర్తిచేయాలన్న తలంపుతో ఉన్నది. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణ నిర్మాణానికి సుమారుగా 450 మిలియన్ డాలర్ల (రూ.3300 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. దాతల సహకారంతో ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది.