
శ్రీరామనవమి సందర్భంగా సింగపూర్‌లో కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ భక్తుల హారతి, శ్లోకాలు, మంత్రోచ్ఛారణలతో ఉత్సవమూర్తులకు మంగళస్నానం నిర్వహించారు. అనంతరం మహిళలు గౌరీ పూజ, కుంకుమార్చన చేశారు. కోలాటం, భజనల నడుమ ఉత్సవమూర్తులను భక్తులు పల్లకిలో ఊరేగించారు. శ్రీ సీతారాములకు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు నిర్వహించారు. వివాహ ఘట్టం ముత్యాల తలంబ్రాల కార్యక్రమంతో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు.


ఈ కల్యాణ మహోత్సవంలో 40 జంటలు పాల్గొని శ్రీ సీతారాముల ఆశీర్వాదాలను పొందారు. వేడుక అనంతరం అందరికీ సంప్రదాయ ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుక భక్తుల మధ్య సామాజిక ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించి, తెలుగువారి సంప్రదాయాల వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబించింది. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ఎంతో శ్రమించి ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. విజయవంతంగా నిర్వహించిన ఈ వేడుకలో 600 మందికి పైగా భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనగా, 15,000 మందికి పైగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

