ఒమాన్ రాజధాని మస్కట్‌లోని శ్రీ కృష్ణ మందిరం శ్రీరామ జయరామ.. జయజయ రామ అన్న భక్తుల రామనామస్మరణలతో మార్మోగింది. స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రధ్ధలతో వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తులకు కనువిందు చేసింది. అరటి తోరణాలు మొదలు జీలకర్ర బెల్లం వరకు పూజకు అవసరమైన మోత్తం సామాగ్రిని స్థానికంగా ఒమాన్ నుండి సమకూర్చుకోగా వారణాసి నుండి ప్రత్యేకంగా వచ్చిన పురోహితులు కప్పగంతుల దత్తాత్రేయ శర్మ, సత్యాధిత్యలకు స్థానికంగా ప్రవాసీ పండితులయిన విజయకుమార్ తోడవడంతో వేదమంత్రాల మధ్య తెల్లవారు నుండి మొదలయిన కార్యక్రమం రాత్రి వరకు అంగరంగ వైభవంగా జరిగింది.
స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, నివేదన అనంతరం ఉత్సవమూర్తులకు భక్తుల కోలాహలం, మంగళవాయిద్యాలు, భక్తుల కరతాళ ధ్వనులు, జయ రామ స్తోత్రాల నడుమ కల్యాణ క్రతువు పూర్తయింది. సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను స్థానిక తెలుగు ప్రముఖులు గుడేటి మధుసూధన్, సత్య వెంకట్, వెంకట కృష్ణారావు సత్తి, చందక రాందాస్‌లు పర్యవేక్షించారు. వేయికిలో మీటర్ల దూరంలోని సలాల, సోహార్, ఇబ్రి ఎడారి ప్రాంతాల నుండి కూడా వందల సంఖ్యలో భక్తులు మస్కట్‌కు తరలి వచ్చారు.