రాజకీయ విమర్శలు, వ్యూహాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఈసారి సినీ రంగం వైపు అడుగులు వేస్తూ ఆసక్తికర ప్రకటన చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జీవిత చరిత్రను తెలుగులో సినిమాగా తెరకెక్కించనున్నట్లు ఆయన ప్రకటించారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా ఈ బయోపిక్ రూపొందనుంది.

తన కుమారుడి వివాహ వేడుకల నేపథ్యంలో సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగ్గారెడ్డి ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి బయటి నిర్మాతలు ఎవరూ ఉండరని, సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే స్వయంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం పార్టీ శ్రేణులంతా ఆర్థికంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

కేవలం ఒక రాజకీయ నాయకురాలిగానే కాకుండా, గాంధీ కుటుంబంలో ఒక కోడలిగా, భార్యగా, తల్లిగా సోనియా గాంధీ ఎదుర్కొన్న ఒడుదొడుకులను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించాలన్నదే తమ ఉద్దేశమని జగ్గారెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ అర్ధాంగిగా, రాహుల్, ప్రియాంకలకు తల్లిగా ఆమె సాగించిన జీవన ప్రయాణం ఇందులో కీలకంగా ఉంటుంది. సముద్రమంత లోతైన కాంగ్రెస్ రాజకీయాలను అర్థం చేసుకున్న ఆమె, మూడుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా పదవిపై వ్యామోహం లేకుండా తృణప్రాయంగా వదులుకున్న చారిత్రక ఘట్టాలను తెరపై ఆవిష్కరించనున్నారు. భర్త మరణానంతరం పీవీ నరసింహారావుకు, యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్‌కు ప్రధాని పీఠాన్ని అప్పగించిన ఆమె నిస్వార్థ రాజకీయాలను నేటి తరానికి తెలియజేయనున్నట్లు జగ్గారెడ్డి వివరించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే ఆమె ఏకైక ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు.

ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు 50 మందితో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి గాంధీభవన్ పీఆర్‌వో హరిప్రసాద్ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా క్లాప్ కొట్టించి ఈ చిత్రం షూటింగ్‌ను ఘనంగా ప్రారంభించనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.















