అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో స్వామివారి కల్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణోత్సవం ప్రారంభానికి ముందు అన్ని వస్తువులను, ప్రాంగణాలను పండితులు పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి ఆరాధనను చేపట్టారు. తరువాత కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమగుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లారు. అనంతరం వైదిక క్రతువు అయిన అంకురార్పణలో భాగంగా అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు. ప్రాయశ్చిత హోమం నిర్వహించి దేవతామూర్తులకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం కన్యాదానం, మాంగల్యధారణ, వారణమాయిరం చేపట్టారు. చివరిగా శ్రీదేవి ని కుడి వైపున, భూదేవిని ఎడమ వైపు కూర్చోబెట్టి స్వామివారికి కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి ఇవ్వడంతో కల్యాణోత్సవం ముగిసింది. శ్రీవారు అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని భక్తులు నేత్రపర్వంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
