ఏడుకొండలవాడు, శ్రీనివాసుడు తన దేవేరులతో కలిసి తిరుమల కొండ దిగి సముద్రాలు, ఖండాలు దాటి అమెరికా వస్తున్నాడు. ఈ నెల 25న డల్లాస్‌లోని క్రెడిట యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్‌లో శ్రీనివాసుడి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారు తెలుగువారితో సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలందుకోనున్నారు. డల్లాస్‌లో ఉంటున్న తెలంగాణ, తెలుగు, హిందూ ప్రజలందరికీ వెంకన్న దర్శనం, విశేష సేవల్లో భాగస్వాములయ్యే భాగ్యం కల్పించేందుకు టీపాడ్ తగిన ఏర్పాట్లను చేస్తున్నది. పద్మావతి, అలివేలు సమేత శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికీ స్వామివారి లడ్డూ ప్రసాదం, విశేష పూజల్లో భాగస్వాములయ్యే వారికి తిరుమల లడ్డూతో పాటు వస్త్రం అందజేయనున్నట్లు టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. వైభవంగా నిర్వహించే స్వామివారి విశేష సేవా కైంకర్యాల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని నిర్వహకులు వివరించారు. అందరూ ఆహ్వానితులేనని, పార్కింగ్ కూడా ఉచితమని టీపాడ్ ప్రతినిధులు తెలిపారు.
అలెన్ ఈవెంట్ సెంటర్ ( క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్) వేదికగా డల్లాస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) భక్తి ప్రపత్తులతో చేపడుతున్న ఈ విశేష కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా దేవదేవతల ప్రతిరూపాలను, పూజారులను వెంటబెట్టుకుని రానున్నారు.