సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడికి సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. వీటితో పాటు విష్ణు దుర్గ అమ్మవారికి అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని స్థానిక సెరంగూన్ రోడ్‌లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంనందు అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా, కోలాహలంగా గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు. తెలుగు ప్రజలందరూ భారీగా తరలివచ్చిన ఆ దేవదేవుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించిన తెలుగు సమాజానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణోత్సవానంతరం శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు.
తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగు వారందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని ఆకాంక్షించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం, కార్యవర్గ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహాయ సహకారాలతో తీసుకొని వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ, వడ ప్రసాదాలను, మంగళ ద్రవ్యాలను, బహుమానాన్ని అందచేసామని తెలిపారు.
కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా సుమారు 3,000 మంది వీక్షించారని, అలానే ఈ ఉగాది నాడు సుమారు 2,000 మందికి సింగపూర్ లోనే అరుదుగా లభించే వేప పువ్వు అందించారు. సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని సుమారు 6,000 మందికి పైగా అందించామని, కార్యక్రమానికి హాజరైన వారికి అన్నప్రసాదాన్ని అందించామని కార్యక్రమ నిర్వాహకులు బచ్చు ప్రసాద్ తెలియజేశారు. కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు, దాతలకు, కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు, భక్తులకు, పంచాంగ శ్రవణం చేసిన పండితులకు, వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన, లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.