తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణం కన్నుల పండుగలా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలోని వివిధ నగరాల్లో గత కొన్నాళ్లుగా శ్రీవారి కల్యాణాలను జరుపుతున్నారు. టిటిడి అర్చకస్వాములు, వేదపండితులు వైఖానస ఆగమం ప్రకారం, శ్రీవారి కల్యాణోత్స క్రతువులో పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఎపిఎన్ ఆర్‌టిఎస్ టిటిడి, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలను సమన్వయం చేసుకుని కల్యాణోత్సవం నిర్వహణలో పాలు పంచుకుంటోంది. అశేష సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యక్షంగా కల్యాణఘట్టాన్ని తిలకించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ స్వామి ప్రసాదం పంపిణీ చేశారు.














