ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. రెండు దేశాలు సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలతో తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ కొరియా లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది. ఉత్తర కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవుల్లో ఈ డ్రిల్స్‌ను చేపట్టింది. దీనిపై కిమ్ జోంగ్ ఉన్ సోదరి, ఉత్తర కొరియాలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు చేపట్టడం తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ఆత్మహత్యా సదృశ్యమేనని పేర్కొన్నారు. తమను రెచ్చగొడితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సౌత్ కొరియా డ్రిల్స్‌కు జవాబు చెప్పే పనిలో తమ సైనిక బలగాలు నిమగ్నమయ్యాయని పేర్కొన్నారు.