అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అయన ప్రయాణిస్తున్న డ్రాగన్ వ్యోమనౌక గ్రీస్ ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. గురువారం సాయంత్రం 4.01 గంటల ప్రాంతంలో మొదలైన ఈ డాకింగ్ ప్రక్రియ 4.15 గంటలకు విజయవంతంగా ముగిసింది. అనంతరం వివిధ సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకొని సాయంత్రం 5.44 గంటలకు ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాన్షు ఐఎస్‌ఎస్‌లోకి అడుగు పెట్టారు.ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. శుభాన్షు బృందానికి స్టేషన్‌లో ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా రోదసిలోకి వెళ్లడం తెలిసిందే.

రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయిన శుభాన్షు ప్రయాణిస్తున్న క్యాప్సుల్ 28 గంటల ప్రయాణం తర్వాత గురువారం సాయంత్రం ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రం మీద డాకింగ్ ప్రక్రియ జరిగినట్టు నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. శుభాన్షుతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, హంగరీకి చెందిన టిబర్ కపు, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ ఐఎస్‌ఎస్‌లోకి అడుగు పెట్టారు. 14 రోజులపాటు వీరందరూ అక్కడే 60కి పైగా శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు.
