ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం ప్రత్యేక సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 81వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం సాహిత్యంలో హాస్యం` అలనాటి విశిష్ట రచయితల హాస్యరచనా వైభవం ( గురజాడ, భానుమతి, మొక్కపాటి, ముళ్ళపూడి, చిలకమర్తి, భమిడిపాటి, శ్రీరమణ) ఆద్యంతం నవ్వుల జల్లులు కురిపించింది. తానా అధ్యక్షుడు శృంగవరపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికి స్వాగతం పలికారు.

తెలుగు సాహితీవేత్తల్లో కొందరు విశిష్ట రచయితలు సృష్టించిన హాస్య సాహిత్య వైభవాన్ని ఈరోజు ఈ వేదికమీద చర్చించుకోవడం ముదావహం అంటూ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ హాస్యంకోసం హాస్యరచనలు చేసినవారు కొందరైతే, ఆనాటి వాస్తవ సాంఘిక, సామాజిక సమస్యలే ఇతివృత్తంగా కొంతమంది చేసిన రచనలు సహజంగా హాస్యాన్ని సృష్టించాయి. రచనలతో హాస్యం పండిరచడం పాఠకుల్ని మెప్పించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలాంటి దాన్ని అలవోకగా సాధించిన రచయితలలో కొంతమందిని ఎంపికచేసుకుని వారి రచనావైభవాన్ని మననం చేసుకోవడం, వారిని స్మరించుకోవడం చాలా సబబుగా ఉంది అన్నారు.


ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న ప్రముఖ రచయిత్రి ఆచార్య డా.చుండూరి మృణాళి, ప్రముఖ హాస్యకథా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ రచయిత డా,కొచ్చెర్లకోట జగదీశ్, ప్రసిద్ధ తెలుగు కథా, నవలా రచయిత యర్రంశెట్టి శాయి, ప్రముఖ చిత్రకారుడు కూచి, ప్రముఖ నాటకకర్త, నటుడు డా.చిట్టెన్ రాజు వంగూరి, ప్రముఖ రచయిత, దర్శకుడు ఫణి డొక్కొలు గురజాడ, భానుమతి, మొక్కపాటి ,ముళ్ళపూడి, చిలకమర్తి, భుమిడిపాటి, శ్రీరమణలు సృష్టించిన అసంఖ్యాక రచనలోని విశేషాలను, పాత్రల స్వభావాలను అద్భుతంగా ఆవిష్కరించి ఆద్యంతం నవ్వులు పూయించారు.


హాస్య ప్రధానంగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.















