ఎన్టీఆర్, ఘంటసాల ఇద్దరూ యుగపురుషులని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భాను మాగులూరి అధ్యక్షతన వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్, ఘంటసాల శత జయంతిని పురస్కరించుకుని ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్ రామకృష్ణ, నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, సామినేని కోటేశ్వరరావు, గోరంట్ల పున్నయ్య చౌదరి, గంటా పున్నారావు తదితరులు పాల్గొన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపింది. తల్లిదండ్రులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలాంటి సమావేశాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/123117238_030723nrinews1b.jpg)
ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతికి, తెలుగు భాషకు ఎన్టీఆర్, ఘంటసాల గుర్తింపు తీసుకువచ్చారు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని, గొప్పతనాన్ని ఎన్టీఆర్, ఘంటసాల భావితరాలకు అందించారు. ప్రపంచ తెలుగుదనాన్ని ఒక గొడుగు కిందకు చేర్చిన ఇరువురు యుగపురుషులు అని కొనియాడారు. భాను ప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులు అమెరికాలో బాగా స్థిరపడ్డారన్నారు. జన్మభూమి స్ఫూర్తితో గ్రామాల్లో మన వంతుగా పేద విద్యార్థినీ, విద్యార్థులకు సహాయసహకారాలు అందించాలన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/123117238_030723nrinews1c.jpg)
గోరంట్ల పున్నయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతిభ, పేదరికం, గ్రామీణ నేపథ్యం ఉన్న బాలికల కోసం ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నామన్నారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ భగవద్గీతను ఆలపించడం ద్వారా ఘంటసాల, కృష్ణుడి పాత్ర ద్వారా ఎన్టీఆర్ ప్రపంచ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి మహనీయుల శతజయంతి ఉత్సవాలు జరుపుకునే అవకాశం రావడం మన అదృష్టం అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-26.jpg)
ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మైనేని రాంప్రసాద్, సెక్రటరీ మన్నవ వెంకటేశ్వరరావు ఈ వేడుకను సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో మన్నె సత్యనారాయణ, కృష్ణ లాం, రాం చౌదరి ఉప్పుటూరి, కార్తీక్ కోమటి, సుశాంత్ మన్నె, హను గట్టు, కిషోర్ కంచర్ల, హరికృష్ణ, బండ మల్లారెడ్డి, రమణారావు కంభంపాటి, కోట రామ్మోహన్, వై.శంకర్రావు, పాకాలపాటి కృష్ణయ్య, యండమూరి నాగేశ్వరరావు, రవి ఐతా, ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-26.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-26.jpg)