హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అడ్డంకులు తొలగిపోయాయి. నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. హుస్సేన్‌సాగర్ సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జీహెచ్‌ఎంసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే చివరి అవకాశం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
జీహెచ్‌ఎంసీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ వచ్చిందని సోలిసిటర్ జనరల్ అన్నారు. విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ ఆర్డర్‌ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చూట్టు క్రేన్‌లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలు ఒక్క ఏడాదికి మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీల్లేదని పేర్కొంది.