విద్యా, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలోని మహిళా వర్సిటీతో తానా అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో వర్సిటీలో నిర్వహించిన సమావేశంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ విద్యా, సాంస్కృతిక రంగాల్లో అమెరికా, భారత్ సంబంధాలు మరింతగా బలపడాలని ఆకాంక్షించారు. ఉత్తర అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సంప్రదాయ కళల్లో నైపుణ్యం కలిగించడానికి కొత్తగా కళాశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మహిళా విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడిరచారు. వర్సిటీ వీసీ జమున మాట్లాడుతూ మహిళా యూనివర్సిటీ చేపట్టే కార్యక్రమాల్లో తానా సేవలను వినియోగించుంటామన్నారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, తెలుగు భాషా సాహిత్య ఉన్నతికి తానా ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు.