నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న చిత్రం తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం. ప్రస్తుతం ఈ చిత్రం కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటున్నది. తండేల్ సారాంశాన్ని వివరించే ప్రయత్నంలో తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లిన నాగచైతన్య పాత్ర రాజును పరిచయం చేస్తూ ప్రారంభమయ్యే గ్లింప్స్‌లో ఈపాలి యేట గురి తప్పేదే లేదేస్ ఇక రాజులమ్మ జాతరే అని చైతూ చెప్పిన మాస్ డైలాగ్ ఆకట్టుకుంది. తోటి జాలర్లతో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి జాలరి రాజు ప్రవేశిస్తే కరాచీ సెంట్రల్ జైల్లో బంధించి కఠిన శిక్షలు అమలు చేస్తారు. జాతీయవాదాన్ని ప్రశ్నించిన జైలర్‌కు మా నుండి ఊడిపోనా ఒక ముక్క, మీకే అంతుంటే ఆ ముక్క ముష్టేసిన మాకెంతుంటుంది, భారత్ మాతాకీ జై అని నాగచైతన్య సమాధానమిచ్చిన తీరు అందరిలో దేశభక్తిని ప్రేరేపించేలా ఉంది. రాజు ప్రేమికురాలిగా సాయిపల్లవి పోషించిన బుజ్జి తల్లి పాత్ర చిత్రణ తీరు ఈ గ్లింప్స్‌తో తెలిసింది. గతానికి భిన్నంగా చైతూ రస్టిక్ అవతారంలో కనిపించారు. శ్రీకాకుళం యాసను బాగా పలికారాయన.