నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా సెట్స్ నుంచి షూట్ డైరీస్ పేరుతో కొన్ని ఫొటోలను విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న జాలరుల నేపథ్య కథాంశమిది. అనూహ్య పరిస్థితు ల్లో పాకిస్థాన్ సైన్యానికి పట్టుబడ్డ జాలరుల బృందం అక్కడి నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ఏమిటన్నదే చిత్ర కథాంశం. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దేశభక్తి అంశాలు, నాయకా నాయికల మధ్య ప్రేమకథ హృదయాన్ని స్పృశిస్తాయని చిత్ర బృందం చెబుతున్నది. షూట్ డైరీస్‌లో నాగ చైతన్య, సాయిపల్లవి డీ గ్లామర్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో జరిగే ఈ కథను అక్కడి నేటివిటీ, సహజత్వం ప్రతిబింబించేలా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల, సమర్పణ: అల్లు అరవింద్, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.