
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో, ఫిలడెల్ఫియా ప్రాంతంలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్ లోని చారిత్రాత్మక కట్టడం నేషనల్ మెమోరియల్ ఆర్చ్ ప్రాంగణంలో మార్చ్ 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను పురస్కరించుకుని పలువురు రాష్ట్ర టీడీపీ నాయకులు ఎన్టీఆర్ సేవలను కొనియాడుతూ, నవ్యాంధ్ర నిర్మాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఎందరో నాయకులకు స్ఫూర్తి ప్రధాత చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో మనమందరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలదండేసి, కేక్ కట్ చేసి ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ సభ్యులు తెలుగు దేశం పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఆమదాలవలస శాసన సభ్యులు కూన రవికుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్, ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
