ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్చూరు, బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేలు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, నరేంద్ర వర్మ ఆ దేశ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌తో భేటీ అయ్యారు. మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ ఎన్నారై టీడీపీ విభాగం ఆహ్వానం మేరకు ఆ దేశ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానితో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. చంద్రబాబు సారథ్యంలో నెలకొల్పిన కియా కార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూజిలాండ్‌కు వస్తున్నాయని ఎమ్మెల్యేలు ఆయనకు తెలిపారు. చంద్రబాబు తనకు తెలుసని, మంచి విజనరీ నాయకుడుని క్రిస్టోఫర్ కితాబిచ్చారు.

న్యూజిలాండ్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రావాలని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ పరిశ్రమలను నెలకొల్పాలని కోరారు. మార్చిలో అమరావతి పర్యటనకు వస్తానని ప్రధానమంత్రి క్రిస్టోఫర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు న్యూజిలాండ్ నేషనల్ పార్టీ ప్రతినిధులు శివ కిలారి, బాలా వేణుగోపాల్ వీరం, టీడీపీ న్యూజిలాండ్ కో ఆర్డినేటర్ జితేందర్ నిమ్మగడ్డ, న్యూజిలాండ్ ఎన్నారై టీడీపీ అసోసియేషన్ నాయకులు, మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ నేతలు మద్దుకూరి దిలీప్, అశోక్ గోరంట్ల తదితరులు పాల్గొన్నారు.
