
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పలువురు ఎన్నారైలు టీడీపీ ప్రస్తానాన్ని, సమర్థ నాయకుడి నాయకత్వ పటిమను గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీ అనేక జయాపజయాలు ఎదుర్కొని రాష్ట్ర ప్రగతికి కట్టుబడి పనిచేసిందని వక్తలు పేర్కొన్నారు. పేద, బడుగు బలహీన, ముస్లిం, మైనార్టీ వర్గాలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలతో పాటు నాడు ఐటీ రంగంలో చంద్రబాబు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను కొనియాడారు. ఆ నిర్ణయాల వల్లే నేడు తెలుగువారు ప్రపంచం నలుమూలలూ ఐటీ రంగంలో విశేషంగా రాణిస్తూ సత్తా చాటుతున్నారని తెలిపారు.

75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు తపన, విజన్ 2047 కోసం ఆయన ప్రణాళికలు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. ఉగాది రోజు ఆయన ప్రతిపాదించిన పీ4 పథకానికి తమ వంతు బాధ్యతగా చేయూతనందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాను మాగులూరి, రాజేష్ కాసరనేని సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో రావు లింగా, జానకి రామ్, నాగ్ నెల్లూరి, సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, సతీష్ చింత, సురేష్ చనుమోలు, సుశాంత్ పాల్గొన్నారు.
