తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఇటీవల రెండో సారి ఆయన చంద్రబాబును కలిసి పోటీ చేస్తామంటూ సుమారు 75 మంది జాబితాను అందజేశారు. అధినేత ఇవేమీ పట్టించుకోకుండా ఎన్నికలకు వద్దే వద్దని చెప్పడంతో తీవ్ర నిరాశతో ఆయన వెనుదిరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అంతా సిద్ధం చేసుకున్నాక, పోటీ చేయవద్దని చంద్రబాబు చెప్పారని, ఈ నిర్ణయం తనను చాలా బాధించిందని అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయల్లేదని తాను పార్టీ కార్యకర్తలకు చెప్పలేనని, అందుకే టీడీపీ పార్టీకి రాజీనామా చేశాననీ కాసాని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడటానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు 20 సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదని కాసాని అసహనం వ్యక్తం చేశారు. ఈ సారి పోటీ చేయాల్సిందే అని తెలంగాణలోని పార్టీ కేడర్ మొత్తం కోరుతోందని, దీనిని అధిష్టానం పట్టించుకోవడమే లేదని కాసాని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.