డాలస్ నగరంలో ఏటా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఈ దఫా ఆ ప్రాంతమే మురిసిపోయేట్టు మరింత వేడుకగా నిర్వహించింది. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను కలిపి ఫ్రిస్కో పట్టణ పరిధిలోని కొమెరికా సెంటర్‌లో వైభవంగా జరిపించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన కార్యక్రమం జనం రాకతో సందడిగా మారింది. సుమారు 12వేల మంది ఈ వేడుకల్లో భాగస్వాములైనట్టు టీపాడ్ బృందం తెలిపింది.
ఫౌండేషన కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వంలో నిర్వహించిన ఈ సంబరాల్లో సద్దుల బతుకమ్మకు దసరా పండగ తోడవడంతో మగువలతో పాటు మగవారూ ఉత్సాహంగా, కలర్‌ఫుల్‌గా కనిపించారు.
ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆ తర్వాత బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. టాలీవుడ్ స్టార్ నటి సంయుక్త మీనన్ ప్రతి బృందంతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయింది. ఈ వేడుకకు వచ్చింది తొలిసారే అయినా, సంయుక్త అందరితో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడడం తెలుగు మహిళలందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించింది.
బతుకమ్మ వేడుకల అనంతరం అదే వేదికపై దుర్గామాతను ప్రతిష్టించి నిర్వాహకులు శమీపూజ నిర్వహించారు. అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దసరా పండుగ రోజు బంగారంలా భావించే శమీపత్రాలను ఒకరినొకరు పంచుకుని అలయ్ బలయ్ తీసుకున్నారు.
అనంతరం కళాకారుల బృందం అమ్మవారి మహాశక్తిని నృత్యరూపకంగా ప్రదర్శించి గూస్‌బంప్స్ తెప్పించింది. అటు డ్యాన్సర్లు, ఇటు గాయకుల అలుపెరగని ప్రదర్శనతో కార్యక్రమం మరింత కనుల విందుగా మారింది. భారత్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన గాయకులు సమీర భరద్వాజ్, పృథ్వీ, ఆదిత్య, అధితీ భావరాజు తమ పాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బైక్‌రాఫెల్, 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాముల గోల్డ్‌రాఫెల్‌ను సినీనటి సంయుక్త మీనన్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. టీపాడ్ తలపెట్టిన ఈ కార్యక్రమం ఇంత వైభవంగా సాగేందుకు కారణమైన స్పాన్సర్లతో నటి సంయుక్తామీనన్ సమావేశం కావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
ఇక జాతరకు ఏమాత్రమూ తీసిపోదన్నట్టు వెలిసిన వెండర్ స్టాల్స్ ఆసాంతం రద్దీతో కనిపించాయి. కొమెరికా సెంటర్‌లోకి అడుగుపెట్టేందుకు తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా మెటల్ డిటెక్టర్‌లతో ప్రతి బ్యాగ్‌ను స్కాన్ చేసి పంపించారు.