అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వదేశానికి వెళ్తే, తిరిగి అమెరికాకు రానిస్తారా? లేదా? అన్నదానిపై హెచ్1బీ వీసాదారులలో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రఖ్యాత టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్1బీ వీసాదారులను అప్రమత్తం చేస్తూ, దేశాన్ని వీడొద్దని సూచించాయి. మళ్లీ అమెరికాకు తిరిగిరావడానికి అనుమతి ఉంటుందో? లేదోననే అనుమానాలు ఉన్నందున, ఈ హెచ్చరికలు జారీచేస్తున్నట్టు సదరు కంపెనీలు పేర్కొన్నాయి.

అమెరికాను వీడొద్దంటూ ఆయా ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇప్పటికే సూచించాయి. దీంతో భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు పలువురు హెచ్1 బీ వీసాదార్లు చెబుతున్నారు. ఒకవేళ చట్టాన్ని మార్చితే, వలసదార్ల పిల్లల పౌరసత్వం అగమ్యగోచరంగా మారేట్టు ఉందని ఒకరు వాపోయారు. అమెరికా పౌరులు మినహా, మిగతా అందరూ అక్రమ వలసదారులే అన్న భావన అక్కడ నెలకొని ఉందని భారతీయ వలసదారులు చెబుతున్నారు. దీంతో తాము ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలన్నీ వెంట తీసుకెళ్తున్నామని చెప్పారు.
