యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 3న రానుందని వెల్లడించారు. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023 అని వెల్లడించారు. పరిశీలన 13 నవంబర్, 2023 అని వివరించారు. ఇక ఉపసంహరణ చివరి తేదీ 15 నవంబర్, 2023 (బుధవారం) అని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ 3 డిసెంబర్, 2023న జరుగుతుందన్నారు.
రాజస్థాన్‌కి నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. ఇక చత్తీష్‌గఢ్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరగనున్నాయి. ఇక అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సహా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు జరిపామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు
కాగా, తెలంగాణ లో మొత్తం 119 నియోజకవర్గాలకు, మధ్యప్రదేశ్ లో 230, రాజస్థాన్ లో 200, ఛత్తీస్‌గఢ్ లో 90, మిజోరం లో 40 అసెంబ్లీ స్థానాలను ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోబిఆర్ఎస్ , మధ్యప్రదేశ్‌లో బిజెపి, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి.