అమెరికాలో తెలుగు విద్యార్థి శ్రీ నిహల్ తమ్మనకు అరుదైన గౌరవం లభించింది. తాను స్థాపించిన రీ సైక్లింగ్ మై బ్యాటరీ అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఏకథాటిగా ఒక్కరోజులోనే 31,204 బ్యాటరీలను లైనింగ్ చేసి రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలో అత్యధికంగా ఒక్కరోజులోనే 30 వేలకు పైగా బ్యాటరీలను ఇంతవరకు ఎవరు లైనింగ్ చేయలేదు.. తన రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సభ్యుల సహకారంతో ఈ ఘనతను నిహాల్ సొంతం చేసుకున్నారు.
ఇది ప్రపంచంలో పర్యావరణ మేలు కోరుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తుందని గిన్నీస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. న్యూజెర్సీ ఎడిసన్‌లో రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సాధించిన విజయాలను అధికారికంగా నమోదు చేసి నిహాల్‌కు గిన్నీస్ రికార్డు ధ్రువ పత్రాన్ని అందించారు. రీసైకిల్ మై బ్యాటరీ సాధించిన ఈ విజయం తన పిలుపు స్పందించిన విద్యార్ధుల సహకారంతోనే సాధ్యమైందని ఈ సందర్భంగా నిహాల్ తెలిపాడు. చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై నిహాల్ దృష్టి. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీ నిహాల్ పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు.
రీసైకిల్ మై బ్యాటరీ ప్రస్థానం ఇది.
2019లో రీసైకిల్ మై బ్యాటరీ(ఆర్.ఎం.బి) పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 500 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు మూడు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. దాదాపు కోటిన్నర మందికి బ్యాటరీల రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఆర్.ఎం.బీ బ్యాటరీ డబ్బాలను ఏర్పాటు చేశారు. కాల్ టూ రీసైకిల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో అడుగు వేసింది. బ్యాటరీలను సేకరించడం, వాటిని రీసైక్లింగ్ స్టేషన్‌లకు బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే శ్రీ నిహాల్‌కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ కూడా శ్రీనిహాల్ సొంతమైంది.