అగ్రరాజ్యం అమెరికాకు 68 ఏళ్ల క్రితం ఓడల్లో పయనించి వెళ్లి మన తెలుగు ఉన్నతిని సమున్నత స్థాయికి చేర్చిన తెలుగు తేజం రత్తయ్య జాస్తి (94) కన్ను మూశారు. గత కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం అగ్రరాజ్యంతో ఆయన అనుబంధం ఏర్పరుచుకున్నారు. తెలుగు వారు ఎక్కడా ఉన్నా కలిసి మెలిసి ఉండాలని స్వప్నించిన రత్తయ్య జాస్తి సతీమణి 20 ఏళ్ల కిందటే కన్నుమూశారు. రెండు రోజుల కిందట అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రత్తయ్య జాస్తి పరిస్థితి విషమించి చనిపోయినట్లు కాలిఫోర్నియాలోని బే ఏరియా తెలుగు సంఘాల నాయకులు తెలిపారు.
రత్తయ్య జాస్తి ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బోడపాడు గ్రామానికి చెందిన వారు. 1928లో జన్మించిన ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చేశారు. బెంగళూరులోని ఐఐఎస్‌సీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం పీహెచ్‌డీ కోసం అమెరికా బాటపట్టారు. మిన్నెసోటా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం కాలిఫోర్నియాలోని లాక్‌హీడ్ మార్టిన్‌లో ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం కాలిఫోర్నియాలోని లాక్‌హీడ్ మార్టిన్ లో ఇంజినీర్‌గా ఉన్నత స్థాయిలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే 1954లో ఆయన అమెరికాకు ఓడలో ప్రయాణించి వెళ్లారు. అలా ఓడలో ప్రయాణించిన వెళ్లిన తొలి తరం తెలుగు వారు కూడా ఆయనే. సుమారు 38 రోజుల పాటు ఇలా ప్రయాణించాల్సి వచ్చేది.
రత్తయ్య జాస్తి మృతి పట్ల బే ఏరియా కమ్యూనిటీ నాయకుడు జయరాం కోమటి, ప్రొఫెసర్ ఆంజనేయులు కొత్తపల్లి, డాక్టర్ హనిమిరెడ్డి లక్కిరెడ్డి కుటుంబం, డాక్టర్ పేరయ్య సుందనగుంట, భగత్ సింగ్ యలమంచిలి, జోషి అన్నే, భోగేశ్వర రావు దయనేని, కాలిఫోర్నియాలోని బే ఏరియా కమ్యూనిటీ నాయకులు, స్థానిక తెలుగు సంఘాలు, తానా కార్య వర్గాలు ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశాయి.