ప్రతిష్టాత్మకమైన అమెరికా మారథాన్ పోటీలకు తెలంగాణకు చెందిన జగన్‌మోహన్ రెడ్డి అర్హత సాధించాడు. అమెరికాలోని చికాగో వేదికగా అక్టోబర్ 10న ఈ మారథాన్ జరుగనుంది. ఈ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ అథ్లెట్లు పాల్గొంటారు. ఇక భారత్ తరపున తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన జగన్ మోహన్ రెడ్డి దీనికి అర్హత సాధించి చరిత్ర సృష్టించారు. ఈ మారాథన్‌కు అర్హత సాధించడం అంత తేలికెం. అయితే తెలుగుతేజం జగన్‌మోహన్ రెడ్డి మాత్రం అసాధారణ ప్రతిభతో ఈ మారథాన్‌కు అర్హత సాధించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు.
జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సుమారు 30 వేల మంది పాల్గొననున్న మారథాన్‌లో సత్తాచాటి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. మారాథాన్ పోటీల్లో జగన్ మోహన్ రెడ్డి పతకం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎల్‌ఎల్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.