అమెరికా, చైనా మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తున్న అమెరికా నిఘా విమానాన్ని డ్రాగన్ ఫైటర్ జెట్ దాదాపు ఢీకొట్టబోయింది. అమెరికా విమానానికి అత్యంత సమీపంలోకి చైనా యుద్ధ విమానం దూసుకొచ్చినట్లు యూఎస్ మిలిటరీ వెల్లడించింది. డిసెంబరు 21న జరిగిన ఈ ఘటన గురించి యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో చట్టపరంగానే తాము సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అమెరికా పేర్కొంది.
అమెరికా వైమానిక దళానికి చెందిన ఆర్సీ`135 దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తుండగా చైనా జే`11 ఫైటర్ జెట్ కేవలం 6 మీటర్ల ( 20 అడుగులు) దూరంలోకి వచ్చింది. దాదాపుగా ఢీకొట్టినంత పనయింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో మేం యథావిధిగా చట్టబద్దంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే చైనా ఇలా యుద్ధ విమానాలతో సవాల్ విసురుతోంది అంటూ నిందించారు. 2001లో చైనా చేసిన ఇలాంటి పని వల్ల ఆ దేశ విమానం కుప్పకూలి పైలట్ దుర్మరణం పాలయ్యాడని గుర్తు చేసింది.